అడుగంటుతున్న జలం.. ఎండుతున్న పొలం

అడుగంటుతున్న జలం.. ఎండుతున్న పొలం
  • యాదాద్రి జిల్లాలో 2 వేల ఎకరాలు
  • ‌‌‌‌‌‌సూర్యాపేట  జిల్లాలో 8,160 ఎకరాల్లో ఎండిన వరి  
  • ‌‌‌‌‌‌ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టం
  • ‌‌‌‌‌‌రైతుల్లో ఆందోళన

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు:  భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎండాకాలం ప్రారంభంలోనే బోర్లు ఆగిఆగి పోస్తున్నాయి. కొన్నిచోట్ల వరి పంట ఎండుతోంది. యాదాద్రి జిల్లాలో యాసంగి సీజన్ లో 2,75,316 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో మూసీ పరిధిలో దాదాపు 50 వేల ఎకరాల్లో వేశారు.  అయితే,  వానాకాలంలో జిల్లాలో వానలు సరిగా కురవలేదు.  దీంతో  భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి.  

జిల్లాలోని 12 మండలాల్లో 10 మీటర్ల దిగువన ఉండగా, 6 మండలాల్లో 4.98 మీటర్ల నుంచి 9.24 మీటర్ల దిగువన ఉన్నాయి. సంస్థాన్​ నారాయణపురంలో 23.09  మీటర్లు,  ఆత్మకూర్(ఎం)లో 18.18, బొమ్మల రామారంలో 14.06 మీటర్ల దిగువన, అతి తక్కువగా అడ్డగూడులో 4.98 మీటర్ల దిగువన ఉన్నాయి. జిల్లాలో యావరేజ్​గా 10.95 మీటర్ల దిగువన భూగర్భజలాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.  జిల్లాలో  2 వేల ఎకరాల్లో పొలాలు ఎండినట్లు తెలుస్తోంది.  ఎండలు ముదిరితే పంట చేతికిరావడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

సూర్యాపేటలో ఇదీ పరిస్థితి..

ఎండలు తీవ్రరూపం దాల్చకముందే సూర్యాపేట జిల్లాలో  భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో జిల్లా సగటు నీటిమట్టం 8.28 మీటర్లు కాగా, వారం రోజుల్లోనే 4 మీటర్లకు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగి సీజన్​లో 4.76 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది.

1.80  లక్షల ఎకరాలకు పైగా బోర్ల కింద సాగవగా, 2.92 లక్షల ఎకరాలకు పైగా ఎన్ఎస్పీ, ఎస్సారెస్పీ, మూసీ కింద సాగవుతోంది. నీటి వినియోగం ఎక్కువవుతున్న దృష్ట్యా భూగర్భ జలాలను  తోడేస్తున్నారు. దీంతో సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నాయి.  జిల్లా సగటు నీటిమట్టం ప్రస్తుతం 8.29 మీటర్లు ఉంది.  హుజూర్ నగర్ లో 20.46 మీటర్లకు పడిపోగా, నూతనకల్ లో 15.93 మీటర్లు, జాజిరెడ్డిగూడెం, చిలుకూరు మండలాల్లో 12 మీటర్లు, సూర్యాపేటలో 11.81 మీటర్ల లోతుకు నీళ్లు చేరాయి. 

ఎస్సారెస్పీ నుంచి అందని నీరు 

సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద 1,08,490 ఎకరాలు,  ఎన్​ఎస్పీ కింద 1,73,931 ఎకరాలు, మూసీ కింద 10,664 ఎకరాలు, బోరు బావుల కింద 1,80,659 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి నీరందక 8,160 ఎకరాల్లో పంట ఎండిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు కంటతడి పెడుతున్నారు.